సర్పంచులకు రూ.25 వేల గౌరవ వేతనం ప్రకటించాలి: భూమన్న యాదవ్

బిక్కనూర్ (ఆంధ్రప్రభ): రాష్ట్రంలోని సర్పంచులకు నెలకు రూ.25 వేల గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని రాష్ట్ర సర్పంచుల ఫోరం గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో పలు గ్రామాల సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిపై సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రస్తుతం అందుతున్న గౌరవ వేతనాన్ని పెంచే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సర్పంచులు పనిచేయాలని కోరారు.

అనంతరం మండలంలోని సర్పంచులు భూమన్న యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు శ్రీవాణి వాసు యాదవ్, సర్పంచులు జగదీష్, శ్రీనివాస్, నీలం రెడ్డి, గంధం భూమయ్య, బన్నీ తదితరులు పాల్గొన్నారు.