భీంగల్ పనుల కోసం దీక్షకు యత్నం.. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
వేల్పూర్ (ఆంధ్రప్రభ): భీంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి 70 శాతం పూర్తయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు సిద్ధమైన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు మంగళవారం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. వేల్పూర్ మండలంలోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
భీంగల్లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి, కొత్త మార్కెట్ యార్డు, బస్ డిపో, సీసీ రోడ్ల పనులు ఇప్పటికీ పూర్తికాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భీంగల్లో నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదంటూ పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ ఘటనతో వేల్పూర్, భీంగల్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసుల చర్యను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖండించారు.
