ఎన్‌డీఏ ప్రభుత్వంపై వైసీపీ అబద్ధ ప్రచారం

వైద్య కళాశాలలపై తప్పుదారి పట్టించే ప్రయత్నం
బీజేపీ అధికార ప్రతినిధి డా. వినూషా రెడ్డి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వైద్య కళాశాలల స్థాపనలో ఎన్‌డీఏ ప్రభుత్వం (the NDA government) అమలు చేస్తున్న పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానం గురించి వైఎస్సార్‌సీపీ అవాస్తవ ప్రచారం చేస్తోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి డా. వినూషా రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నార‌న్నారు. బుధవారం ఆమె కర్నూల్ లో విలేక‌రుల సమావేశంలో మాట్లాడారు.

పీపీపీ మోడల్‌ నిజాలు వివరించిన బీజేపీ
పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదని, ఇది ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య మోడల్ మాత్రమేనని స్పష్టం చేశారు. మొత్తం కాల పరిమితి 33 ఏళ్లు ఉంటుందని.. భూమి, భవనాలు, కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని తెలిపారు. ఔట్‌పేషెంట్ సేవలు, ల్యాబ్‌ పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని చెప్పారు. 70 శాతం పడకలు పేదల కోసం ఉచితంగా అందుబాటులో ఉంటాయని.. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలు యథావిధిగా అమల్లోనే ఉంటాయని పేర్కొన్నారు.

ప్రతి కళాశాలలో 150 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు ప్రారంభమవుతాయని, తరువాత పీజీ సీట్లు కూడా కలపనున్నారని తెలిపారు. 50 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలో ఉంటాయని, అన్ని రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పారు. ఫీజులను ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ( ఏపీహెచ్ఈఆర్ఎంసీ) నిర్ణయిస్తుందని, ఎంబీబీఎస్ ఫీజు కోటి రూపాయలని వైఎస్సార్‌సీపీ చెబుతున్న వాదన పూర్తిగా అబద్ధమని ఖండించారు.

వాస్తవాలు వెలుగులోకి..
వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం 17 వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,480 కోట్లు అంచనా వేసి, ఐదేళ్లలో కేవలం రూ.1550 కోట్లు (18%) మాత్రమే ఖర్చు చేసిందని ఆమె వెల్లడించారు. 11 కళాశాలల నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం రూ.768 కోట్లు విడుదల చేసి, పనులు మళ్లీ ప్రారంభించిందని వివరించారు. ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఐఐటీ చెన్నై వంటి రాష్ట్రాలు, సంస్థలు కూడా పీపీపీ మోడల్‌ను అమలు చేస్తున్నాయని తెలిపారు.

వైఎస్సార్‌సీపీని నిలదీసిన ప్రశ్నలు
వైఎస్సార్‌సీపీ పీపీపీ విధానం తప్పు అయితే, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను కూడా వ్యతిరేకిస్తారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో కేవలం 18 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని కోరారు. పులివెందులకే రూ.400 కోట్లు వెచ్చించి, ఇతర జిల్లాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజీలకు జగన్ రెడ్డి జారీ చేసిన జీఓపై కూడా బీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది.

కర్నూలు, అనంతపురం, విజయవాడ, విశాఖలో సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ హాస్పిటల్‌లు అభివృద్ధి చేయలేదని, కర్నూలు మెడికల్ కాలేజీలో కార్డియాలజీ సేవలను ప్రైవేట్‌కు ఔట్‌సోర్స్ చేసిన దాఖలాలు ఉన్నాయని డా. వినూషా రెడ్డి విమర్శించారు. అలాగే రూ.2,700 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు వదిలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరిస్తారని పేర్కొన్నారు.

కోర్టులు పీపీపీ విధానం సరైనదని చెప్పిన తర్వాత కూడా జగన్ రెడ్డి దానిని గౌరవించకపోవడం విచారకరమని ఆమె అన్నారు. పీపీపీ విధానంతో ఎన్‌డీఏ ప్రభుత్వం వైద్య రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోందని, లక్షలాది రోగులకు ఉచిత వైద్యం, వేలాది విద్యార్థులకు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందే అవకాశం కలుగుతోందని తెలిపారు. తమ పాలనలో జరిగిన టీటీడీ లడ్డూ, మద్యం కుంభకోణాలకు సమాధానం చెప్పలేక వైఎస్సార్‌సీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని తిరస్కరిస్తారని డా. వినూషా రెడ్డి హెచ్చరించారు.