విద్యావంతులై ఉన్నత స్థాయిలో స్థిర పడాలి
నర్సాపురం, ఆంధ్రప్రభ: విద్యకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని విద్యా వంతులై ఉన్నత స్థాయిలో స్థిర పడాలని తహసీల్దార్ ఈ. నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలో ఉన్న స్టేషన్‌పేటలోని బాలుర వసతి గృహాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్య పై ఆరా తీశారు. హాస్టల్ లో అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్య పై దృష్టి పెట్టీ లక్ష్య సాధనకు కృషి చేయాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమైన తహసీల్దార్ వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, వసతి గృహంలో ఎదురవుతున్న సమస్యల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వంటశాలను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వలు, నాణ్యతపై , విద్య , వైద్య సేవలు పై వసతి గృహ సిబ్బందికి, సంబంధిత అధికారులకు కొన్ని సూచనలు సూచించారు.
