యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలి..

యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలి..

పరిశ్రమల సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం అనుమతులు మంజూరు చేయడం మాత్రమే కాదని, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఇప్పటికే స్థాపించిన పరిశ్రమల సమస్యలను పరిష్కరించడం కూడా అధికారుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధి, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పరిశ్రమల విస్తరణ, ప్రభుత్వ సబ్సిడీలు, టూరిజం ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడానికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు స్థాపించిన తర్వాత ఎదురయ్యే సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

నైపుణ్యం గల కార్మికుల కొరత, ఎగుమతుల అవకాశాలు, ప్యాకింగ్–బ్రాండింగ్ సమస్యలు, ముడిసరుకు అందుబాటు వంటి అంశాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు డీపీఆర్ తయారీ నుంచి పరిశ్రమ ప్రారంభం వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్, ఆకర్షణీయ ప్యాకేజింగ్ లేకపోవడం వల్ల మార్కెట్ విలువ తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థాలను తగ్గిస్తూ అదనపు ఆదాయం పొందేందుకు బై-ప్రొడక్ట్స్ తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు.

సమావేశంలో పలువురు పారిశ్రామికవేత్తలు భూమి కేటాయింపు, పరిశ్రమ విస్తరణ, విద్యుత్ సమస్యలు, మష్రూమ్ యూనిట్లు, కొబ్బరి క్లస్టర్ ఏర్పాటు వంటి అంశాలపై వినతులు అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.

సింగిల్ డెస్క్ విధానంపై సమీక్షలో భాగంగా వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తుల పురోగతిని ఆమె పరిశీలించారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీ శాఖ, బాయిలర్ శాఖ దరఖాస్తుల స్థితిని సమీక్షించారు.

జిల్లాలో టూరిజం అభివృద్ధికి రిసార్ట్స్, బోటింగ్, రిక్రియేషన్ ప్రాజెక్టుల అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా స్థాపించబడాలని ఆకాంక్షిస్తూ సమావేశాన్ని ముగించారు.

Leave a Reply