దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం దృష్టి

  • క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్
  • నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటు, క్యూ కాంప్లెక్స్ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన శాకంభరీ ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో రానున్న శరన్నవరాత్రి దసరా మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం యంత్రాంగం దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ బుధవారం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన అన్నదాన భవనం, లడ్డూ పోటు నిర్మాణం, క్యూ కాంప్లెక్స్ అభివృద్ధి పనులతో పాటు భక్తులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు.

అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమై పనుల నాణ్యత, నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. దసరా మహోత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

రానున్న దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని ఇంజినీరింగ్ అధికారులకు ఈవో వి.కె. శీనా నాయక్ స్పష్టం చేశారు.