సర్ ప్రక్రియలో 21 వేల ఓట్ల తొలగింపునకు కుట్ర: బీఆర్ఎస్ ఆరోపణ

అధికారులు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: సర్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 21 వేలకుపైగా ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీశైలం ఈ ఆరోపణలు చేశారు.

వలస ఓటర్ల పేర్లను గ్రామసభల్లో చేసిన తీర్మానాల కంటే అధికంగా తొలగిస్తున్నారని, సుమారు 20 వేల ఓట్లను జీరోగా చూపిస్తున్నారని ఆయన అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారులు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన బీఎల్ఓల సమావేశానికి నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారని, మండల కార్యాలయాల్లో జరిగిన సమావేశాల్లో కూడా పలువురు అధికారులు పాల్గొన్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై ఈ నెల 25న జిల్లా కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీశైలం తెలిపారు. అధికారులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

మాజీ సింగిల్ విండో చైర్మన్, స్థానిక కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు మాట్లాడుతూ, మున్సిపల్ కమిషనర్ విధులను విస్మరించి ప్రజాప్రతినిధుల సమావేశాల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. సర్ ప్రక్రియలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ యువ నాయకుడు విష్ణు మాట్లాడుతూ, తమ పార్టీ నిరసనలకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ఇతర పార్టీల నిరసనల విషయంలో అదే విధానాన్ని పాటించడం లేదని ఆరోపించారు.

ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, మండల నాయకులు కేశవులు గౌడ్, రామకృష్ణారెడ్డి, నగేష్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.