గ్రంథాలయాల అభివృద్ధికి కేడీసీసీ బ్యాంకు సహకారం
కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాంను కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడలోని కేడీసీసీ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాంను ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణ, ప్రజలకు మరింత మెరుగైన గ్రంథాలయ సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.
జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కేడీసీసీ బ్యాంకు తరఫున సాధ్యమైనంత సహకారం అందించాలని ఎం.ఎస్. బేగ్ కోరారు. విద్యా వికాసానికి, పఠన సంస్కృతి పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని నెట్టెం శ్రీ రఘురాం పేర్కొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు యువతకు విజ్ఞాన వనరులను మరింత చేరువ చేయడంలో గ్రంథాలయాల పాత్ర అత్యంత కీలకమని, ఈ దిశగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, ఆర్థిక సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు.
