చారిత్రాత్మక చంద్రగిరి కోటలో యోగాంధ్ర సందడి

చారిత్రాత్మక చంద్రగిరి కోటలో యోగాంధ్ర సందడి

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి యోగానే మార్గం: జాయింట్ కలెక్టర్ గోవిందరావు

తిరుపతి, ఆంధ్రప్రభ : ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఉత్తమ మార్గమని, ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం చారిత్రాత్మక చంద్రగిరి కోటలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగా గురువులు సూచించిన విధంగా అధికారులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా యోగాసనాలు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా యోగా చైతన్యం

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 21న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7 నుంచి 21 వరకు గ్రామ, సచివాలయ, మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో విస్తృతంగా యోగా కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే జూ పార్కులో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇప్పుడు చారిత్రాత్మక చంద్రగిరి కోటలో యోగా సాధన చేపట్టడం ప్రత్యేకతను సంతరించుకుందని పేర్కొన్నారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ముఖ్యంగా విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే యోగాపై అవగాహన పెంపొందించుకుని దానిని దినచర్యగా మార్చుకోవాలని సూచించారు.

జూన్ 21న భారీ యోగాంధ్ర కార్యక్రమం

జూన్ 21న జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు పాల్గొనే భారీ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజలందరూ పాల్గొని యోగా సందేశాన్ని మరింత విస్తృతంగా చాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలు నిర్వహించారు.