Tirupati | కిడ్నాప్‌లు, ఛేజింగ్‌లు.. నిర్భందాల నడుమ డిప్యూటీ మేయర్ ఎన్నికలు
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల తిరుపతి, చిత్తూరులో ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు ఆదివారం రాత్రి నుంచి చిత్తూరులోని భాస్కర్ హోటల్‌ల్లో నిర్బంధించారు. బయటకు రాకుండా కూటమి నేతలు కార్లను అడ్డంగా పెట్టారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లను విడిపించేందుకు వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని కూడా కూటమి నేతలు నిర్బంధించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మదన్, టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాసులు, మాజీ టౌన్ చైర్మన్ పులిగోరు మురళీ, క్రిష్ణా యాదవ్ టీడీపీ కార్యకర్తలు, నేతలతో కలిసి అభినయ్ రెడ్డిని ముట్టడించారు. అనంతరం, పోలీసులు అక్కడికి రావడంతో కూటమి వెనక్కి తగ్గారు. దీంతో, భాస్కర హోటల్ నుంచి తిరుపతికు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, నాయకులు బయలుదేరారు. ఎక్కడికక్కడ నిర్బంధంవైసీపీ కార్పొరేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ నిర్భంధిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ రాజేష్‌ను పొద్దుపొడవకముందే అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన కోసం భూమన అభినయ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజేష్‌ను బయటకు పంపాలంటూ డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికను జరగకుండా గొడవలు చేయాలని కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారని, పోలీసులు వారికి సహకారం అందిస్తున్నారంటూ మండిపడ్డారు. కార్పొరేటర్లను జనసేన ఎమ్మెల్యే, కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు.కోడి కూయక ముందే కూల్చివేతలువైసీపీ రెండవ డివిజన్ కార్పొరేటర్ ఉమా అజయ్‌కు చెందిన ఆస్తుల ధ్వంసానికి అధికారులు సోమవారం ఉదయాన్నే రంగం సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నేతలతో కలిసి అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వైసీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేసే విధంగా కూటంమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్ధతిలో ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని అధికారమే పరమావధిగా చెలరేగిపోతున్నారని దుయ్యబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు నడుచుకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలు చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.మెజారిటీ లేక పోయినాభూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైసీపీ సభ్యులను బెదిరించి గెలవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ కార్పొరేటర్లపై కూటమి ప్రభుత్వం, నాయకులు, అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. కార్పొరేటర్ల ఆస్తులు విధ్వంసం చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. కార్పొరేటర్ల బంధువులు, కుటుంబ సభ్యులకు అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.