జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సమీక్ష

జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సమీక్ష

తిరుపతి ప్రతినిధి ఆంధ్రప్రభ: తీవ్ర తుఫాన్ ప్రభావం నేపథ్యంలో, తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ముందుకు సాగుతోంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మంగళవారం అర్ధరాత్రి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లను సందర్శించి తాజా పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, అవసరమైన చోట్ల తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణభద్రతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని, అన్ని పోలీస్ విభాగాలు — లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బ్లూ కోల్ట్, 108 అంబులెన్స్, ఫైర్ సర్వీసులతో సమన్వయం కలిగి నిరంతరం పనిచేయాలని సూచించారు.
ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారులను రిస్క్ ఉన్న ప్రాంతాలలో నియమించి, అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు మరియు సహాయక చర్యలు సమర్థవంతంగా కొనసాగించేలా ఆదేశించారు. తక్కువ భూభాగాలు, జలమయం ప్రాంతాలు, తీరప్రాంతాల్లో క్రమం తప్పని పహారా నిర్వహణతో పాటు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగించాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతే తమ ముఖ్య లక్ష్యం అన్నారు. ఎవరూ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని, పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సర్వీసు, ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఏ పరిస్థితుల్లోనైనా ప్రజలకు పూర్తి సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. తుఫాన్ కారణంగా ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 80999 99977 లేదా 112 ద్వారా వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
