Wrestling | ఆసియా గేమ్స్ నుంచి వినేష్ ఫోగ‌ట్ అవుట్…

Wrestling | ఆసియా గేమ్స్ నుంచి వినేష్ ఫోగ‌ట్ అవుట్…

ఆంధ్ర‌ప్ర‌భ‌ : భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు ఆసియా క్రీడల (Asian Games) ట్రయల్స్‌ బరిలోకి దిగినప్పటికీ, మ్యాట్‌పై ఆమెకు నిరాశే ఎదురైంది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఈరోజు (శనివారం) జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో వినేష్ ఫోగట్.. యువ రెజ్లర్ మీనాక్షి చేతిలో 4-6 తేడాతో పరాజయం పాలైంది.

ట్రయల్స్ నిర్వహణకు ముందు రోజు వరకు వినేష్ ఫోగట్ పాల్గొనడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె కోరుకున్న 53 కిలోల విభాగంలో పోటీ
పడేందుకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మొదట నిరాకరించింది. రిటైర్మెంట్ ప్రకటించి తిరిగి వచ్చే క్రీడాకారులకు ఉండే 6 నెలల డోపింగ్ టెస్టింగ్ నిబంధనలను సాకుగా చూపుతూ డబ్ల్యూఎఫ్‌ఐ ఆమెను అనర్హురాలిగా పేర్కొంది.

దీనిపై వినేష్ ఫోగట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. WFI దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, మే 29న దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా వినేష్ ఫోగ‌ట్ వైపే నిలబడటంతో రెజ్లింగ్ సమాఖ్య దిగిరాక తప్పలేదు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఆమెను 53 కిలోల విభాగంలో పోటీ పడేందుకు అనుమతిస్తున్నట్లు WFI ప్రకటించింది.

సెమీస్‌లో మీనాక్షి చేతిలో పరాజయం..

కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన మూడో ఆసియా క్రీడల పతకంపై కన్నేసిన వినేష్ ఫోగ‌ట్, ఉదయాన్నే స్టేడియానికి చేరుకుంది. గతంలో 2014 కాంస్యం, 2018 లో పసిడి పతకాన్ని గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆమెకు ఉంది. అయితే సెమీఫైనల్లో మీనాక్షితో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు రెజ్లర్లు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ, చివరికి మీనాక్షి 6-4 స్కోరుతో వినేష్‌పై విజయం సాధించి ఆసియాడ్ రేసులో ముందుకు దూసుకెళ్లింది.

మ్యాచ్‌లో ఓటమి అనంతరం వినేష్ ఫోగట్ స్పందిస్తూ భావోద్వేగానికి లోనైంది. “నేను నా 100 శాతం శ్రమను అందించాను. కానీ నేను ఇంకా కష్టపడాల్సి ఉంది” అని వినేష్ పేర్కొంది. మ్యాట్ వదిలి వెళ్లే ముందు అభిమానులను ఉద్దేశించి “మై ఫిర్ ఆవుగీ” (నేను కచ్చితంగా మళ్లీ తిరిగి వస్తాను) అంటూ తనలో ఇంకా కసి తగ్గలేదని స్పష్టం చేసింది.

పారిస్ ఒలింపిక్స్ చేదు అనుభవం తర్వాత..

గతంలో జరిగిన 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన వెయింగ్ (బరువు తనిఖీ) లో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందున ఆమెపై అనర్హత వేటు పడింది. ఆ చేదు అనుభవం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్, తిరిగి క్రియాశీల క్రీడలలోకి వస్తూ తీసుకున్న నిర్ణయానికి కోర్టు మద్దతు లభించినా.. ఈసారి ఆసియాడ్ ట్రయల్స్ రూపంలో మరో నిరాశ ఎదురైంది.

సెప్టెంబర్ నుంచి ఆసియా క్రీడలు…

ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రయల్స్ ద్వారా ఎంపికయ్యే భారత రెజ్లింగ్ జట్టు.. ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక 20వ ఆసియా క్రీడలలో (2026 Asian Games) దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సారి ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి-నాగోయా (Aichi-Nagoya) నగరాల్లో సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్ అయిన ఆసియాడ్‌లో ఈసారి కూడా భారత్ రికార్డు స్థాయిలో పతకాలు సాధించాలని పట్టుదలగా ఉంది.