వీరారంలో కరెంటు కోతలతో ప్రజల అవస్థలు

వీరారంలో కరెంటు కోతలతో ప్రజల అవస్థలు

  • ఉక్కపోతతో బిక్కిరి అవుతున్న ప్రజలు
  • పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలోని వీరారం గ్రామంలో తరచూ జరుగుతున్న విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎండల తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉన్న ఈ సమయంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి వేళల్లో ఫ్యాన్లు, కూలర్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతను తట్టుకోలేక ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అదేవిధంగా విద్యుత్ కోతల కారణంగా తాగునీటి సరఫరాపై కూడా ప్రభావం పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గ్రామంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతో పాటు తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.