అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు
అచ్చంపేటలో ఎకాలజికల్ హోలికా దహనం
ప్రకృతితో అనుబంధాన్ని చాటిన పర్యావరణ హోలీ వేడుకలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: హోలీ పండుగ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో “రంగ్-ఏ-అరణ్య” పేరిట అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు పాఠశాల విద్యార్థులకు అడవిలో లభించే సహజ వర్ణాల ప్రాముఖ్యతను వివరించారు. పాలపిట్ట నీలి రంగు, పచ్చని వృక్షావరణం, పెద్దపులి నారింజ వర్ణం, అడవి పూల రంగుల సమ్మేళనం వంటి ప్రకృతి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ, మన పండుగలు ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉన్నాయో వివరించారు.
కార్యక్రమంలో భాగంగా సుమారు 500 మంది విద్యార్థులతో శ్రమదానం నిర్వహించారు. అడవికి హానికరమైన లంటానా కలుపు మొక్కలను తొలగించి, వాటితోనే సంప్రదాయ “హోలికా దహన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని అధికారులు “ఎకాలజికల్ హోలికా”గా అభివర్ణించారు. విద్యార్థులకు వివిధ రకాలైన వన్యప్రాణులపై ఎస్సే రైటింగ్ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇటీవలి కాలంలో అమ్రాబాద్ అరణ్యంలో పులుల దర్శనం పెరిగిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం, శ్రీశైలం మార్గంలో ఉండటంతో ఇక్కడ ఎకో టూరిజం కార్యకలాపాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

అటవీ సంరక్షణలో చెంచు గిరిజనుల పాత్ర విశేషమని తెలిపారు. తరతరాలుగా అడవిని కాపాడుతూ వచ్చిన చెంచు సమాజానికి జీవనోపాధి అవకాశాలు మెరుగుపడేలా టూరిజం ద్వారా లాభాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో విధులు నిర్వర్తించిన డీఎఫ్‌వో శ్రీ రోహిత్ రెడ్డి హయాంలో పులుల సంరక్షణకు బలమైన పునాది పడిందని అధికారులు గుర్తు చేశారు. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం, శ్రీశైలం మార్గంలో రాత్రివేళ వాహనాల రాకపోకల నిలుపుదల వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కోర్ ఏరియాలోని ఐదు గ్రామాలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం స్టేజ్-2 అనుమతులు సాధించి పునరావాస చర్యలు చేపట్టడంతో సుమారు 4000 ఎకరాల భూమి పులుల సంరక్షణకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం డీఎఫ్‌వో రేవంత్ చంద్ర ఆధ్వర్యంలో ప్రజలు, కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అటవీ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

అమ్రాబాద్‌లోని కృష్ణా నది బ్యాక్‌వాటర్స్, ఆయుర్వేద మొక్కలతో నిండిన అరణ్య ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, అలాగే “దక్షిణ అమర్‌నాథ్”గా ప్రసిద్ధి చెందిన సలేశ్వరంను సందర్శించాలని సూచించారు. భవిష్యత్తులో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను “మిక్స్‌డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్”గా గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ గుర్తింపు లభిస్తే తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజినల్ అధికారి చంద్రశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ డి ఓ రామ్మోహన్, అటవీ క్షేత్రాధికారులు ఈశ్వర్, సుబుర్, లింగాల, అచ్చంపేట రేంజిల పరిధిలోని అన్ని రకాల అటవీ శాఖ సిబ్బంది, అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
