గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది..
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది..
రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం గోలపల్లి నుండి మంథన్ గోడ్ రోడ్డుకు ఒక కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన నూతన వంతెన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మక్తల్ ను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.
రోడ్లు పెద్దగా ఉంటేనే గ్రామాలకు గౌరవం పెరుగుతుందన్నారు. రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతే వారికి ఇండ్లుమంజూరు చేస్తామని హామీనిచ్చారు. మీ సహకారం ఉంటే గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి సూచించారు. గ్రామాల్లో రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని గుర్తు చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు తద్వారా దేశం బాగుపడుతుందని అన్నారు. మక్తల్ ను ఈ రెండున్నర ఏళ్లలో చాలా అభివృద్ధి చేశామన్నారు. గ్రామాలను బాగు చేసుకున్నప్పుడే మనం తెలివిమంతులము అవుతామని అన్నారు.

మక్తల్ కు 220 కేవీ సబ్ స్టేషన్ ను త్వరలోనే తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. మక్తల్ లో రోడ్డు విస్తరణకు అడ్డమైతే నా ఇల్లు కూల్చమని ఆదేశించానని గుర్తు మంత్రి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు గోలపల్లి గ్రామ సర్పంచ్ సూర్యకుమార్, మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్ రాజేందర్ గౌడ్,మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, మార్కెట్ మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
