ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సూర్యప్రకాశ్ రెడ్డి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా చింతాన్పల్లి సూర్యప్రకాశ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శనివారం ఏకగ్రీవంగా నియమించింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
సూర్యప్రకాశ్ రెడ్డి గతంలో ఊట్కూర్ జెడ్పీటీసీ సభ్యుడిగా, సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రతి కార్యకర్తకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తానని అన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. సూర్యప్రకాశ్ రెడ్డి నియామకంపై మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
