Temples | గ్రహణ సమయంలో పూజలందుకునే ఆలయాలు ఇవే..

Temples | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చంద్రగ్రహణం సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా దేవాలయాలు మూసివేయబడతాయి. పూజలు నిలిచిపోతాయి, ఆలయ ప్రాంగణాలంతా నిశ్శబ్దంగా మారిపోతాయి. అయితే ఇదే సమయంలో కొన్ని ప్రముఖ ఆలయాల్లో మాత్రం దీపాలు వెలుగుతూనే ఉంటాయి. మంత్రోచ్ఛారణ ఆగదు. భక్తుల రాక తగ్గదు. చంద్రగ్రహణం వేళ ఈ రెండు భిన్న దృశ్యాలు భారతీయ సంస్కృతిలోని విశ్వాసం, సంప్రదాయం, ఆలోచనా విధానాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం చంద్రగ్రహణాన్ని రాహు–కేతువుల ప్రభావ కాలంగా భావిస్తారు.
ఈ సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయని, దేవాలయ పవిత్రతపై ప్రభావం పడుతుందని ఆలయాలు గ్రహణానికి ముందే ద్వారాలు మూసివేస్తారు. గ్రహణం పూర్తి అయిన తర్వాత ఆలయాల్లో అభిషేకాలు, శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనా భాగ్యం కల్పిస్తారు. కానీ గ్రహణం వేళ్లల్లో కూడా దేశంలో కొన్ని ఆలయాలు మాత్రం మూసివేయకుండా తెరిచే ఉంచుతారు. ప్రత్యేకంగా చెప్పుకునే ఆలయం శ్రీకాళహస్తి ఆలయం. రాహు–కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శాంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలోని నవగ్రహ క్షేత్రంగా పేరుగాంచిన ఉమా కుక్కుటేశ్వర ఆలయం గ్రహణ సమయంలో పూజలు నిర్వహిస్తారు. పూర్వ కాలం నుంచి కూడా గ్రహణ సమాయంలో గుడిని తెరిచి ఉంచడం అనవాయితీగా వస్తుందని ఆలయాధికారలు పేర్కొన్నారు.
కేరళ కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీకృష్ణుడి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట అందుకే స్వామివారికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఈ నేపథ్యంలో స్వామివారికి ఆహారం పెట్టకుంటే స్వామి విగ్రహం తగ్గుతుందని ఈ కారణంగా గ్రహణ సమయంలో కూడా ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు. రాజస్థాన్ రాష్ట్రం బికనీర్‌లోని లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరట.
ఎందుకంటే ఓసారి గ్రహణం సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యేక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది.
ఇక్కడ శివుడు స్వయంభు మహాకాళ రూపంలో కొలువై ఉంటాడని.. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదని పండితులు చెబుతారు. ఢిల్లీలోని కల్కాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం విశేషం. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని, గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గ్రహణ సమయంలో కూడ ఈ దేవాలయాలను తెరిచే ఉంచుతారు.
