శిశువుకు తల్లిపాలే శ్రేష్ఠం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
గోదావరిఖని, ఆంధ్రప్రభ: శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే శ్రేష్ఠమని రామగుండం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దయాల్ సింగ్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ మాట్లాడుతూ శిశువుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపొందించడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల పాటు శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలే అందించాలని సూచించారు.
పుట్టిన వెంటనే వచ్చే ముర్రపాలు శిశువుకు వ్యాక్సిన్లా పనిచేస్తాయని, శిశువు ఆరోగ్యానికి అవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలపై ఆసుపత్రికి వచ్చిన మహిళలకు అవగాహన కల్పించారు.
తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు, గోదావరిఖని నర్సింగ్ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, మెడికల్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
