ఆరోగ్య రంగానికి భారీ ప్రతిపాదనలు..
- మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వినతి
బాల్కొండ నియోజకవర్గం, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందుబాటు లక్ష్యంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, నియోజకవర్గంలోని ఆరోగ్య రంగ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, మౌలిక సదుపాయాల విస్తరణ, వైద్యులు, సిబ్బంది కొరత, మందుల లభ్యత, ప్రజారోగ్య సేవల మెరుగుదల, నియోజకవర్గాల వారీగా పెండింగ్లో ఉన్న పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భీంగల్లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.
అలాగే భీంగల్లో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాహత్నగర్కు తరలించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు అక్కడ నూతన పీహెచ్సీ భవనం నిర్మించాలని, భీంగల్లో ప్రత్యేక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మోర్తాడ్ మండలంలోని పాలెం లేదా తిమ్మాపూర్లో కొత్త పీహెచ్సీ,బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు నూతన భవనం, బాల్కొండ–మోర్తాడ్ మండలాల్లో పోస్టుమార్టం భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
నియోజకవర్గంలోని 24 గంటలు ఉండే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అవసరమైన క్యాడర్ బలం మంజూరు చేసి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తొమ్మిది ఉపకేంద్ర భవనాలకు సంబంధించిన ఎన్హెచ్ఎం నిధులను విడుదల చేయాలని, 18 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని మంజూరు చేయడంతో పాటు ఖాళీ పోస్టుల భర్తీ, అత్యవసర అవసరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాల్కొండ నియోజకవర్గంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు చేసినట్లు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్థు,ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
