తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం
- వరుస దొంగతనాలకు బ్రేక్
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు అరెస్ట్
రామగిరి, ఆంధ్రప్రభ : రామగిరి, ముత్తారం మండలాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుల్లో ముగ్గురిని రామగిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల చర్యతో వరుస దొంగతనాలకు బ్రేక్ పడిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రామగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావె శంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ వివరాలు వెల్లడించారు. దొంగలు జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించినట్టు వివరించారు.
శనివారం ఉదయం ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కల్వచర్ల శివారులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారన్నారు. వారి నుంచి వివరాలు సేకరించగా పలు చోట్ల దొంగతనాలను ఒప్పుకున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా తారకరామనగర్కు చెందిన దాసరి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన వనం పాపయ్య, అశ్వారావుపేటకు చెందిన వనం నగేష్ లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు.
నిందితుల నుండి కారు, సెప్టిక్ ట్యాంకర్, టివిఎస్ స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు పగలు రెక్కీ చేసి, రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, వరుస దొంగతనాలకు పాల్పడ్డారని, స్కూటీ, సెప్టిక్ ట్యాంకర్, కారు, అద్దెకు తీసుకున్న మరో కారు, పాపయ్యకు చెందిన స్కూటీలను ఉపయోగిస్తూ.. ఒక్కోసారి ఒక్కో వాహనంలో పగలు ఊర్లలో తిరిగి తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించేవారని తెలిపారు.
అనంతరం రాత్రి సమయాల్లో ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించేవారని తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను వనం రాము విక్రయించి, వచ్చిన డబ్బులను మిగతా నిందితులకు పంచి, వారు వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. గతంలో కూడా ఇదే ముఠా సభ్యులు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఏసీపీ అభినందించారు. ఈకార్యక్రమంలో మంథని సీఐ రాజు గౌడ్, ఎస్సై టి.శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
