Forest Land | మంత్రి కొండా సురేఖ
పోడు భూముల వివాదంపై సమగ్ర నివేదిక కోరిన మంత్రి..
గిరిజనుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని వెల్లడి
Forest Land | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబొట్లగూడెంలో పోడు భూముల అంశంపై గుత్తికోయలు, అటవీశాఖ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘటనపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ ఘటనపై తన దృష్టికి వచ్చిన వివరాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. గుత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను తక్షణమే అందించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, చట్టపరంగా, న్యాయబద్ధంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్యలను అధికారులు సున్నితంగా, మానవీయ కోణంలో పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
