రూ.22 కోట్లతో బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి పొంగులేటి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులే కీలకం..
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
అశ్వాపురం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అశ్వాపురం నుంచి గొందిగూడెం మీదుగా మొండికుంట వరకు రూ.22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారి వ్యవస్థ ఎంతో అవసరమని అన్నారు. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ రహదారి నిర్మాణంతో అశ్వాపురం, గొందిగూడెం, మొండికుంట గ్రామాల ప్రజలతో పాటు రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
