ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత: ఆకుల అశోక్
నిజామాబాద్ సాంస్కృతికం, (ఆంధ్రప్రభ): ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎన్‌ఆర్‌ఎస్‌టీ చైర్మన్, రిటైర్డ్ పీపీ ఆకుల అశోక్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ (జిల్లా-3150) ఆధ్వర్యంలో ఆదివారం న్యాల్కల్ రోడ్డులోని ఎన్‌ఆర్‌ఎస్‌టీ ప్రాంగణంలో జిల్లా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వంటి సమస్యల నుంచి భావితరాలను రక్షించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ వంటి సేవా సంస్థలు పర్యావరణ పరిరక్షణలో చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా రోటరీ కమ్యూనిటీ సెంటర్‌లో 60కుపైగా పండ్ల, పూల, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను రోటరీ సభ్యులు స్వీకరించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్ జవహర్ మాట్లాడుతూ “సర్వీస్ అబౌవ్ సెల్ఫ్” స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ అంకిత్ అగర్వాల్, కోశాధికారి పవన్ పాండే, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ బి. విజయరావు, మాజీ అధ్యక్షులు కటకం శ్రీనివాస్, ఇంగు రాజేశ్వర్, దర్శన్ సింగ్, జితేంద్ర మలాని, రాజ్‌కుమార్ సుబేదార్, వి. శ్రీనివాసరావు, జ్ఞాన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, అది పెరిగే వరకు సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
