అల్లంపల్లి జీయర్ గురుకులంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణులకు ఆహారం అందించడమే లక్ష్యం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకులం పాఠశాల, కళాశాల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శనివారం సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పెద్ద సంఖ్యలో సీడ్ బాల్స్ తయారు చేశారు.
సీడ్ బాల్స్ తయారీలో చింత, నేరేడు, వేప తదితర వివిధ రకాల విత్తనాలను ఉపయోగించారు. ముఖ్యంగా ఫలవృక్షాల విత్తనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అడవుల విస్తీర్ణం తగ్గడం, అడవుల్లో వన్యప్రాణులకు ఆహారం కొరత ఏర్పడటంతో అవి గ్రామాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఫలవృక్షాలను అధికంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
వర్షాకాలంలో సీడ్ బాల్స్‌ను అడవులు, కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో విసరడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని చెట్లు పెరిగి పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు వన్యప్రాణులకు సహజసిద్ధమైన ఆహారం లభిస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎ. మహేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రధర్, శాంతరాం స్వామీజీ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
