ఆపరేషన్ క్లీన్‌స్వీప్ లో ప్రజలు భాగస్వాములు కావాలి

ఆపరేషన్ క్లీన్‌స్వీప్ లో ప్రజలు భాగస్వాములు కావాలి
జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ సంజన సింహ పిలుపు..
నరసరావుపేట, ఆంధ్రప్రభ : పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి, పరిశుభ్రంగా రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ సంజన సింహ పిలుపునిచ్చారు. నెల రోజుల ఈ ప్రత్యేక కార్యక్రమానికి నరసరావుపేట ,సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో శ్రీకారం చుట్టారు.ముందుగా జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా వాటర్ ట్యాంకర్లతో యెల్లో స్పాట్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు.
వారానికో ప్రాధాన్యతాంశంతో నెలరోజులపాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దీనిలో భాగంగా పట్టణాల్లో గుర్తించిన రెడ్, యెల్లో, బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చడం, బల్క్ వేస్ట్ ఉత్పత్తి దారులకు అవగాహన కల్పించి, నిర్మూలనా చర్యల్లో వారిని భాగస్వాములను చేయడం జరుగుతుందని చెప్పారు. యెల్లో స్పాట్స్‌ను గ్రీన్ స్పాట్స్‌గా మార్చి గోడలపై నైతిక బోధనలతో కూడిన పెయింటింగ్స్ వేయిస్తామని తెలిపారు. ప్రజలు తమ ఇంటివద్దనే తడిచెత్త, పొడిచెత్తగా వేరుచేసి ఇవ్వాలని సూచించారు. విజయనగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కార్పొరేషన్ గా మార్చడంలో ప్రజలంతా తమవంతు సహకారాన్ని అందించాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ కోరారు. మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకొనేందుకు ప్రజలంతా ముందుకు రావాలని, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం, విధివిధానాలు, నిర్వహణ గురించి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన వివరించారు. కార్యక్రమంలో ఆర్దీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
