ఎల్కతుర్తి కాంగ్రెస్‌ నాయకులలో తీవ్ర అసంతృప్తి..

  • కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లేదా?
  • పార్టీ కార్యక్రమాల్లో హడావుడి చేసే వాళ్లకే పదవులా..
  • పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తల్లో అయోమయం..

ఎల్కతుర్తి , ఆంధ్రప్రభ : మండల పరిధిలోని విశాల సహకార బ్యాంకుకు సంబంధించిన నూతన పాలకవర్గం నియామకాల్లో నామినేటెడ్ సొసైటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను కొందరికి మాత్రమే కట్టబెడుతున్నారనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దాదాపు తొమ్మిదేళ్ల పాటు కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలను పక్కనపెట్టి స్థానికనాయకులను సంప్రదించకుండా నియామకాలు చేపడుతున్నారని పలువురు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

గ్రామాల్లో పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సొసైటీ డైరెక్టర్లు తదితర ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పదవులను భర్తీ చేయనున్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి. మండలంలో ఆ వ్యక్తులు ఎవరు.. వారి రాజకీయ నేపథ్యం ఏమిటన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా నామినేషన్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసి సంబంధిత గ్రామాల నాయకులతో చర్చించి అందరి ఏకాభిప్రాయంతో అర్హులైన పార్టీ కార్యకర్తలను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఈ విషయంపై హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.