అన్న క్యాంటీన్లలో నాణ్యమైన సేవలే లక్ష్యం..
- కృష్ణలంక అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
- ఆహార నాణ్యత, పరిశుభ్రత, లబ్ధిదారులకు అందుతున్న సేవల పరిశీలన
కృష్ణలంక, ఆంధ్రప్రభ : విజయవాడ అర్బన్ పరిధిలోని కృష్ణలంకలో ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, భోజనం వడ్డించే విధానం, లబ్ధిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా క్యాంటీన్‌కు వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రతి లబ్ధిదారునికి అందిస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్ కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటోందని వెల్లడించారు.
క్యాంటీన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్న క్యాంటీన్ల ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఫీడ్బ్యాక్ అందించే విధానాన్ని కూడా పరిశీలించారు.
