ఏఐతో నేర నియంత్రణకు కొత్త వ్యూహం
ఏఐతో నేర నియంత్రణకు కొత్త వ్యూహం
ఏఐ ఆధారిత టెక్ టీమ్, టీఎస్-కాప్స్ ప్లాట్‌ఫామ్‌తో స్మార్ట్ పోలీసింగ్
సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విభాగాల ఏర్పాటు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్ ఉండేలా కొత్తగా ప్రత్యేక విభాగాల ఏర్పాటుపై డీజీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు.
ఇప్పటికే నేర పరిశోధనలో ఏఐ ఆధారిత సాంకేతికతను విస్తృతంగా వినియోగించేందుకు డీజీపీ కార్యాలయం కేంద్రంగా ‘టెక్ టీమ్’ ఏర్పాటు చేసే బాధ్యతను ఐదుగురు ఐపీఎస్ అధికారులకు అప్పగించారు.
ఇప్పటిదాకా ఘరానా చోరీలు, మావోయిజం వంటి సమస్యలపై పోలీసుశాఖ సీరియస్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం ఆ పరిస్థితులు తగ్గి రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు పెరుగుతుండటంతో వాటి అణచివేత కోసం కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తోంది.
ఐదుగురు ఐపీఎస్‌లతో టెక్ టీమ్
‘టెక్ టీమ్’ ద్వారా తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్, హాక్స్‌ఐ, సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్‌వర్క్ సిస్టమ్), హెచ్‌ఆర్‌ఎంఎస్ (హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) వంటి ప్లాట్‌ఫామ్‌లను డీజీపీ కార్యాలయం పరిధిలోకి తీసుకురానున్నారు.
‘మార్వెల్’ తరహాలో ప్రత్యేక ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అలాగే సీసీటీఎన్ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ వంటి వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ‘టీఎస్-కాప్స్’ మొబైల్ ప్లాట్‌ఫామ్ రూపొందించాలని నిర్ణయించారు. దీని ద్వారా ఒకే మొబైల్ ఇంటర్‌ఫేస్‌లో పలు అప్లికేషన్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
వచ్చే ఆర్నెళ్లలోపు ఈ ప్రాజెక్టులను అమలు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల అమలు పర్యవేక్షణకు ఐదుగురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక కోర్ టీమ్ ఏర్పాటు చేశారు.
కొత్త ప్రత్యేక విభాగాలు
• రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 7 వేలకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ (టీటీఎంఆర్ఎస్) బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. వైద్య, రవాణా శాఖలతో పాటు స్థానిక సంస్థలను అనుసంధానం చేయడంలో ఈ బ్యూరో కీలక పాత్ర పోషించనుంది.
• రాష్ట్రంలో మాదకద్రవ్యాల కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్నాయి. రాజధానిలో సింథటిక్ డ్రగ్స్ కేసులు బయటపడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ క్లబ్ (టీఏడీఏఎస్‌సీ) ఏర్పాటు చేయనున్నారు.
• ఆహార కల్తీ కేసులు కూడా ఆందోళనకరంగా మారాయి. 246 కేసులతో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఎన్‌సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 84 శాతం ఇక్కడే నమోదవడం గమనార్హం. దీంతో ఆహార కల్తీ నిరోధక విభాగం (ఏఎఫ్‌ఏడబ్ల్యూ) ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.
• రాష్ట్రంలో ప్రభుత్వ వనరులను కొల్లగొట్టడం, పన్నుల ఎగవేత, ఇసుక అక్రమ డంపులు, రేషన్ బియ్యం అక్రమ విక్రయాలు, సీనరేజీ ఎగవేత వంటి వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ టాస్క్‌ఫోర్స్ (వీఈడబ్ల్యూటీ)ను బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఆర్నెళ్లలో టెక్ పోలీసింగ్
మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీసుశాఖలో సమూల సంస్కరణలు అవసరమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎస్ఐబీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాల్లో సర్దుబాట్లు చేసి కొత్త విభాగాలకు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఏఐను విస్తృతంగా వినియోగించడం ద్వారా సత్ఫలితాలు సాధించేందుకు రాబోయే ఆర్నెళ్లలో టెక్ పోలీసింగ్ను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
