సమ్మె సైరన్.. ఆగస్టు 15 నుంచి సింగరేణి బంద్ హెచ్చరిక

డిమాండ్లు పరిష్కరించకుంటే అన్ని కార్మిక సంఘాలతో సమ్మె: వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, ఆంధ్రప్రభ: బొగ్గు గని కార్మికుల సమస్యలపై యాజమాన్యం స్పందించి డిమాండ్లను పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణిలో నిరవధిక సమ్మె చేపడతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు, గుర్తింపు సంఘం నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు.

బుధవారం రాత్రి గోదావరిఖనిలోని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలకు పరిష్కారం రాజకీయ పార్టీల ద్వారా కాకుండా కార్మిక సంఘాల ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్మికులను మభ్యపెట్టేందుకే కొన్ని రాజకీయ పార్టీలు గనుల్లోకి వస్తున్నాయని విమర్శించారు.

సింగరేణి సంస్థ అభివృద్ధి చెందాలంటే కొత్త బొగ్గు గనులను ప్రారంభించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న రూ.56 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

సమ్మె నోటీసులో పేర్కొన్న డిమాండ్లపై ఈ నెల 10లోపు యాజమాన్యం, యూనియన్‌తో చర్చలు జరపాలని ప్రాంతీయ కార్మిక కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సూచించారని తెలిపారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 నుంచి అన్ని కార్మిక సంఘాలతో కలిసి సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితిని నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

అర్జీ-1 ఉపాధ్యక్షుడు బోగ సతీష్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లాగౌడ్, కందికట్ల వీరభద్రం, ముస్కె సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, పిట్ కార్యదర్శులు, మైన్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.