పొన్నూరు – చట్టానికి ఎవరూ అతీతులు కాదనడానికి ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టే స్పష్టమైన నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సేవకుడిగా కాకుండా ‘వైఎస్ఆర్ ఆంజనేయులు’గా వ్యవహరించారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో, కక్ష సాధింపు ధోరణితో పనిచేశారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.
గత పాలనలో ఏసీబీ, ఇంటెలిజెన్స్ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన ఆంజనేయులు, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ధూళిపాళ్ల విమర్శించారు. టీడీపీ నాయకులను, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని, చివరికి మహిళలను సైతం లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయించి వేధించారని ఆయన ఆరోపించారు. ఆయన తన అధికారాన్ని న్యాయం కోసం కాకుండా ప్రతీకారం తీర్చుకోవడానికే ఉపయోగించారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందిని బెదిరించారని, అరెస్టులు చేయించారని, వారి పరువుకు భంగం కలిగించారని దుయ్యబట్టారు. ఎందరో మహిళల కన్నీళ్లకు ఆయనే కారణమని అన్నారు.
ఏపీపీఎస్సీ పేపర్ లీక్ కుంభకోణం వంటి ఘటనల ద్వారా ఆంజనేయులు వేలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారికి కొమ్ముకాసి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆయన చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అధికార దుర్వినియోగం మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చాయని విమర్శించారు. చట్టాన్ని అతిక్రమించిన ఏ అధికారి అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరనే వాస్తవాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని తెలిపారు.