IMF Report | చైనా, అమెరికాను మించిన‌ భారత్..

  • ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భార‌త్..
  • ప్రపంచ సగటుకు రెట్టింపు వేగంతో భారత ఆర్థిక వ్యవస్థ..

ఆంధ్ర‌ప్ర‌భ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ తన జోరును కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ (World Economic Outlook Update) నివేదికలో ఈ కీలక వివరాలను వెల్లడించింది.

భారత ఆర్థిక వృద్ధి అంచనాలు..

ఈ క్యాలెండర్ ఇయర్ లో (2026) భారతదేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు 7 శాతంగా నమోదు కానుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వచ్చే క్యాలెండర్ ఇయర్ లో (2027) ఈ వృద్ధి రేటు స్వల్పంగా మందగించి 6.4 శాతానికి పరిమితం కావచ్చునని పేర్కొంది. దేశంలో ప్రైవేట్ వినియోగం (Private Consumption) భారీగా పెరగడం, సేవల రంగం (Services Activity) బలంగా దూసుకుపోతుండటమే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రధాన కారణాలని నివేదిక విశ్లేషించింది. అయితే, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2026లో 3.0 శాతానికి మందగించనుంది. 2027 నాటికి ఇది తిరిగి 3.4 శాతానికి పుంజుకునే అవకాశం ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు మాత్రం ప్రపంచ సగటు వృద్ధి రేటు కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ వాణిజ్య సమస్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ మందగమనంలో పడింది. అయితే, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాలలో డిమాండ్ బలంగా ఉండటం వల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ పతనం నుంచి తప్పించుకోగలిగిందని ఐఎంఎఫ్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెట్యా కోవా బ్రూక్స్ తెలిపారు. ఇంధన కొరత ఏర్పడినప్పటికీ టెక్నాలజీ రంగం దానికి ఊతం ఇచ్చిందని, పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది నాటికి ఆర్థిక వృద్ధి తిరిగి కోలుకుంటుందని నివేదిక పేర్కొంది.

ద్రవ్యోల్బణం సవాళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు మునుపటి కంటే 25% పెరిగి, సగటున బ్యారెల్‌కు $89 వద్ద కొనసాగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. జూలై మధ్య నాటికి కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) తిరిగి తెరుచుకుంటుందని, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయనే అంచనాతో ఈ లెక్కలు వేశారు. ఒకవేళ ఇక్కడ ఊహించని అడ్డంకులు ఎదురైతే ద్రవ్యోల్బణం అంచనాలు మరింత తలకిందులయ్యే ప్రమాదం ఉంది.

ఈ తాజా ఆర్థిక పరిణామాల ప్రభావం వివిధ దేశాలపై భిన్నంగా ఉంది. సాంకేతిక రంగం (Technology), ఇంధన ఎగుమతులపై ఆధారపడిన దేశాలు లాభపడుతుండగా, దిగుమతులపై ఆధారపడే దేశాలు నష్టపోతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే, 2026లో వృద్ధి అంచనా స్వల్పంగా 6.4%కి తగ్గినప్పటికీ, 2027లో దాదాపు 7% (6.7%) వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలవనుంది. చైనా వృద్ధి అంచనా 4.6%కి పెరగ్గా, అమెరికా వృద్ధి రేటు 2.3% వద్ద స్థిరంగా ఉంది. ఇక ఏఐ హార్డ్‌వేర్ ఎగుమతుల పుణ్యమా అని సౌత్ కొరియా వృద్ధి అంచనా 2.6%కి పెరిగింది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా యూరో జోన్ వృద్ధి అంచనా 0.9%కి పడిపోయింది.

ప్రపంచ వృద్ధి కంటే రెట్టింపు వేగం..

ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉండనుండగా, వచ్చే ఏడాది ఇది 3.4 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 4.6 శాతానికి, వచ్చే ఏడాది 4.1 శాతానికి పడిపోనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అమెరికా వృద్ధి రేటు ఈ ఏడాది 2.3 శాతంగా, వచ్చే ఏడాది 2.2 శాతంగా నమోదు కానుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య మందగమనం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. అంతర్గత డిమాండ్, బలమైన దేశీయ మార్కెట్ శక్తుల అండతో భారత్ ఆర్థికంగా ముందంజలో నిలుస్తోందని ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

వివిధ దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలు (2026)

ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని ఐఎంఎఫ్ ప్రధానంగా రెండు శక్తులు శాసిస్తున్నట్లు తెలిపింది. ఒకటి మధ్యప్రాచ్య యుద్ధం వల్ల కలిగిన ప్రతికూల ప్రభావం కాగా, మరొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాంకేతిక రంగం వల్ల లభించిన సానుకూల ఊపు. సాంకేతిక రంగంలో వ్యాపార పెట్టుబడులు, బలమైన ఉత్పాదకత కారణంగా అమెరికా వృద్ధి రేటు 2.3% వద్ద స్థిరంగా ఉంది. ఇంధన ఎగుమతి దేశం కావడంతో దీనిపై యుద్ధ ప్రభావం తక్కువగా ఉంది. పెరిగిన చమురు ధరలు, అంతర్గత నిర్మాణపరమైన ఇబ్బందుల (Structural Headwinds) వల్ల చైనా వృద్ధి రేటు 4.6 శాతానికి మందగించనుంది.

అధిక ఇంధన ధరలు, వినియోగదారులలో నెలకొన్న అపనమ్మకం వల్ల యూరప్ దేశాల వృద్ధి రేటు కేవలం 0.9 శాతానికే పరిమితమైంది. గ్లోబల్ టెక్నాలజీ సైకిల్, సెమీకండక్టర్ల (చిప్స్) డిమాండ్ పుణ్యమా అని సౌత్ కొరియా వృద్ధి 2.6%కి, వియత్నాం వృద్ధి రేటు ఏకంగా 7.5%కి పెరిగాయి. మలేషియా కూడా 4.7% వృద్ధితో లాభపడుతోంది. బ్రిటన్ వృద్ధి రేటు 1.0 శాతానికి పడిపోగా, జపాన్ వృద్ధి కేవలం 0.6 శాతానికే పరిమితం కానుంది. ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) సుదీర్ఘకాలం మూతపడటంతో ఈ ప్రాంత వృద్ధి రేటు భారీగా పడిపోయి 0.7 శాతానికి చేరింది. ఇరాక్, కువైట్, ఖతార్ వంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంకోచాన్ని ఎదుర్కొంటున్నాయి.

అంతర్జాతీయంగా వాణిజ్య మందగమనం, చమురు సంక్షోభం వెంటాడుతున్నా.. భారతదేశం మాత్రం తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రపంచ సగటు వృద్ధి రేటు (3.0%) కంటే మన దేశం రెట్టింపు వేగంతో (6.4%) దూసుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, భారతదేశంలోని బలమైన దేశీయ డిమాండ్ (Domestic Demand), స్థిరమైన ఆర్థిక విధానాలే ఇందుకు ప్రధాన కారణమని, దీనివల్లే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా తన హవా కొనసాగిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.