కెనడా పెట్టుబడిదారులకు రేవంత్ రెడ్డి ఆహ్వానం…
- తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు రావాలని పిలుపు..
- మూసీ, మెట్రో, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. భారత్‌లోని కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ మంగళవారం ముఖ్యమంత్రిని కలుసుకుని ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల భాగస్వామ్యంపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేపడుతున్న ముసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని రేవంత్ రెడ్డి కెనడా సంస్థలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో కెనడా పెట్టుబడులు పెరుగుతున్నాయి….
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ మాట్లాడుతూ తెలంగాణలో కెనడా పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం, సీఐబీసీ హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించడం, సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన CtrlS డేటా సెంటర్స్లో ఒక బిలియన్ కెనడియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం వంటి పరిణామాలను ఆయన ప్రస్తావించారు.
తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధిస్తున్న పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 సంస్థల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పారు. ముసీ నది అభివృద్ధి ద్వారా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర సోలరైజేషన్ కార్యక్రమాలు, గ్రీన్ ఎకానమీ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని కోరారు.
తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో పలువురు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఇదే తరహాలో కెనడాకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు కలిసి హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న రెండో తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొని కొత్త పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలకు ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా క్రిస్ కూటర్ తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రశంసించారు. త్వరలో కెనడా వాణిజ్య ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చి ఇంధనం, పట్టణాభివృద్ధి, రక్షణ, ఏరోస్పేస్ తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరుపుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని కెనడా పర్యటనకు ఆహ్వానించారు.
