harish fire | రేవంత్‌కు వెర్రి, పిచ్చి ఉంది : హ‌రీశ్‌

harish fire | రేవంత్‌కు వెర్రి, పిచ్చి ఉంది : హ‌రీశ్‌

గోదావరిలో నీరు ఉన్నా ఎత్తిపోతల పథకాలను వినియోగించడం లేదని ఆరోపణ
కన్నెపల్లి పంప్‌హౌస్‌ మోటార్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్
రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో సాగునీటి నిర్వహణ, గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఎత్తిపోతల పథకాలను వినియోగించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గోదావరిలో భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోందని అన్నారు. కరువు పరిస్థితులు ఉన్నా, ఇతర ప్రాంతాల్లో వర్షాలు లేకపోయినా, మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎప్పుడూ ఉంటుందని, అందుకే గతంలో అక్కడ బ్యారేజీ నిర్మించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం మేడిగడ్డ వద్ద సుమారు 89,230 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, అయినప్పటికీ నీరు లేదంటూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ నీటిని సద్వినియోగం చేసేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌ మోటార్లను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నిన్న ఒక్కరోజే 1.22 లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా వెళ్లిపోయిందని, గత మూడు రోజుల్లో మొత్తం 3,47,180 క్యూసెక్కుల నీరు వినియోగం కాకుండా దిగువకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం కన్నెపల్లి పంప్‌హౌస్ వైపు అనుకూలంగా ఉన్నందున, వెంటనే మోటార్లు ప్రారంభిస్తే సుమారు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించిన హరీశ్‌రావు, నీటిని ఎత్తిపోతే గత ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రాజెక్టులను వినియోగించడం లేదని విమర్శించారు. ఈ వైఖరి వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు.

ప్రభుత్వం వెంటనే ఎత్తిపోతల పథకాల నిర్వహణపై దృష్టి సారించి, గోదావరి జలాలను సాగుకు వినియోగించే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.