ఉద్యమకారులను ఆదుకోవాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కావడానికి పోరాటాలు నిర్వహించిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తొర్రూరు వాసి,కేయూ జేఏసీ వ్యవస్థాపక కో కన్వీనర్ తేజావత్ సురేష్ నాయక్ కోరారు. హైదరాబాదులోని అమర వీరుల స్మారక కేంద్రంలో బుధవారం ఉద్యమకారులతో అధికారిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సురేష్ నాయక్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులు ఎత్తివేయాలని కోరారు.
సాంకేతిక కారణాలతో పలు కేసులు కొట్టి వేయలేదని, దీంతో కోర్టుల చుట్టూ ఉద్యమకారులు తిరగాల్సి వస్తుందని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమం నడిపిన ఆనాటి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. కాకతీయ యూనివర్సిటీ జేఏసీ ప్రతినిధుల సంరక్షణకు ప్రభుత్వం పాటుపడాలని కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళా సహకారానికి కృషి చేసిన ఆనాటి ఉద్యమకారులు పేదరికంలో మగ్గుతున్నారని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.సురేష్ నాయక్ ప్రతిపాదనలను తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ కే కేశవరావు, సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్ మోతే శోభా రెడ్డి లు సావధానంగా ఆలకించారు.
