Memory card | భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీకి కీలక ఆధారాలు
Memory card | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న రెండు మెమరీ కార్డుల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను భీమ్‌రెడ్డి నమోదు చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా ఆయనకు చెందిన ఆస్తులపై ఏసీబీ సమగ్ర విచారణ చేపడుతోంది.
మొదట తన పేరిట ఆస్తులు కొనుగోలు చేసి, అనంతరం వాటిని బినామీల పేర్లకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. క్యాన్సిలేషన్ డీడ్‌ల ద్వారా ఆస్తులను బినామీల పేరిట మార్చి, వాటిని తానే అనుభవిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
సోదాల సమయంలో భీమ్‌రెడ్డికి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో వెంటనే అరెస్టు చేయలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
