ISRO | గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి..
- విమానం నుండి పారాచూట్ ఎయిర్‌డ్రాప్ పరీక్ష విజయవంతం !
ఆంధ్రప్రభ : భారత ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ (Gaganyaan Mission) దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో భారీ విజయాన్ని అందుకుంది. వ్యోమగాములు (Astronauts) ప్రయాణించే ‘క్రూ మాడ్యూల్’ సురక్షితంగా భూమికి (సముద్రంలోకి) చేరడానికి అత్యంత కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ (IMAT-05) ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని షీపూర్‌లో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE) డ్రాప్ జోన్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
2.5 కిలోమీటర్ల ఎత్తు నుండి ప్రయోగం
మొదటి మానవరహిత గగన్‌యాన్ (G1) మిషన్‌లో ఎదురయ్యే గరిష్ట ఒత్తిడి, లోడ్‌ను తట్టుకునేలా ప్రధాన పారాచూట్ నిర్మాణ పటిష్టతను, డిజైన్‌ను పరీక్షించడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. వాయుసేనకు (IAF) చెందిన భారీ IL-76 రవాణా విమానం సహాయంతో సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తు నుండి ఈ పారాచూట్ వ్యవస్థతో కూడిన ఒక డమ్మీ బరువును (పేలోడ్) కిందకు వదిలారు. విమానం నుండి వదిలిన వెంటనే మొదట ఒక ఎక్స్‌ట్రాక్టర్ పారాచూట్ ఓపెన్ అయి ‘డ్రోగ్ పారాచూట్’ను తెరిచింది. ఇది గాల్లో పేలోడ్ ఊగిసలాటను అదుపు చేసింది. ఆ తర్వాత నిర్ణీత కండిషన్స్ వద్ద ప్రధాన పారాచూట్ (Main Parachute) విజయవంతంగా తెరుచుకుని, ఆ బరువును సురక్షితమైన వేగంతో భూమికి చేర్చింది.
గగన్‌యాన్ పారాచూట్ వ్యవస్థ..
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకురావడంలో పారాచూట్ వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. క్రూ మాడ్యూల్‌ను సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ (స్ప్లాష్‌డౌన్) చేయడానికి ఇస్రో మొత్తం 4 రకాల 10 పారాచూట్లతో కూడిన బహుళ-దశల వ్యవస్థను రూపొందించింది.
నాలుగు దశల్లో ల్యాండింగ్ ప్రక్రియ
గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ల్యాండింగ్ ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఒక్కో దశలో ఒక్కో రకమైన పారాచూట్ పనిచేస్తూ మాడ్యూల్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తుంది.
▶ అపెక్స్ కవర్ సెపరేషన్ పారాచూట్లు (2)
పారాచూట్లను రక్షించే కవచాన్ని తొలగించి, తదుపరి వ్యవస్థ పనిచేసేలా చేస్తాయి.
▶ డ్రోగ్ పారాచూట్లు (2)
క్రూ మాడ్యూల్ వేగాన్ని తొలి దశలో తగ్గించి, గాల్లో స్థిరత్వాన్ని కల్పిస్తాయి.
▶ పైలట్ పారాచూట్లు (3)
డ్రోగ్ పారాచూట్లు విడిపోయిన తర్వాత, ప్రధాన పారాచూట్లను బయటకు లాగి విప్పే బాధ్యత వీటిదే.
▶ మెయిన్ పారాచూట్లు (3)
చివరిదశలో పూర్తిగా తెరుచుకుని మాడ్యూల్ వేగాన్ని గణనీయంగా తగ్గించి, సముద్రంలో సురక్షితంగా స్ప్లాష్‌డౌన్ అయ్యేలా చూస్తాయి.
వ్యోమగాముల భద్రతకు అత్యాధునిక వ్యవస్థ
ఈ మొత్తం ప్రక్రియలో ప్రతి పారాచూట్ నిర్దిష్ట సమయంలో పనిచేయాల్సి ఉంటుంది. ఒక దశ పూర్తయిన తర్వాతే తదుపరి దశ ప్రారంభమవుతుంది. అందుకే ఈ వ్యవస్థను అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించారు. మానవ అంతరిక్ష యాత్రల్లో వ్యోమగాముల ప్రాణ భద్రతకు ఈ పారాచూట్ వ్యవస్థ అత్యంత కీలకమైన సాంకేతిక భాగంగా ఇస్రో పేర్కొంటోంది.
నమ్మకాన్ని పెంచిన ఐదో పరీక్ష
మెయిన్ పారాచూట్ పనితీరును పరీక్షించే సిరీస్‌లో ఇది 5వ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ (IMAT-05). ఈ పరీక్ష విజయవంతం కావడం వల్ల త్వరలో జరగబోయే మొదటి మానవరహిత గగన్‌యాన్ జీ-1 (G1) మిషన్ పారాచూట్ వ్యవస్థపై శాస్త్రవేత్తలకు పూర్తి నమ్మకం ఏర్పడిందని ఇస్రో వెల్లడించింది. ఇస్రో (ISRO), డిఆర్‌డిఓ (DRDO), భారత వైమానిక దళం (IAF), మరియు భారత సైన్యం (Indian Army) సంయుక్తంగా భాగస్వామ్యమై ఈ ఘనతను సాధించాయి.
