ఒడిశా నీరు వస్తోంది..

- చెట్లు.. కరెంటు స్థంభాలు కూలాయి
- విద్యుత్తును పునరుద్ధరించాం
- రాకపోకలకు ఇబ్బంది లేదు
- 9000 ఎకరాల్లో పంట మునిగింది
- సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరణ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షం నష్టంపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, జిల్లాలోని నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజికి 1.4 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చిందని, నాగావళి నదికి తోటపల్లి బ్యారేజికి 44 వేల క్యూసెక్కుల నీరు చేరిందని వివరించారు.
మండల, నియోజక వర్గ ప్రత్యేక అధికారులను నియమించామని, అధికారులు రాత్రి అక్కడే ఉండి విధులు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా కాశీనగరం నుంచి వర్షం నీరు వస్తోందని, ఒడిశా అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.
నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి , పారిశుధ్యం కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. బహుదానది, మహేంద్ర తనయ నదుల నుంచి ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు.
కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేల కూలగా తక్షణమే పునరుద్ధరించినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు చెట్లు కూలగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పడిపోయిన చెట్లను తక్షణమే తొలగించామన్నారు.
వ్యవసాయ భూములు ప్రస్తుతం 9 వేల ఎకరాలు వరకు ముంపుకు గురైనట్లు చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేసి ఉంచినట్లు తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 అక్కడ పనిచేసే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగలేదని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. గురువారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో తాను స్వయంగా వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు
