Hyderabad Youth Choose Healthy Food | హెల్తీ ఫుడ్ వైపు యువతరం అడుగులు..
Hyderabad Youth Choose Healthy Food |
హెల్తీ ఫుడ్ వైపు యువతరం అడుగులు..
Hyderabad Youth Choose Healthy Food | హెల్తీ ఫుడ్ వైపు యువతరం అడుగులు.. హైదరాబాద్, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ఫుడ్ కల్చర్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన యువత, ఉద్యోగులు ఇప్పుడు క్రమంగా హోమ్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం, వీగన్ ఫుడ్ ట్రెండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నిపుణులు, వైద్యుల సలహాలను చూస్తూ డైట్ విధానాలను ఆచరిస్తున్నారు. తమ శరీర ఆకృతికి అనుగుణమైన డైట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. మారుతున్న యువత ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటూ ఫుడ్ డెలివరీ యాప్స్, క్లౌడ్ కిచెన్లు సైతం హెల్తీ డైట్ విధానాన్ని ఎంచుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో ఆహారం విషయంలో ఆరోగ్య నియమాలను పాటిస్తూ శరీర ఆహార్యాన్ని చక్కగా మార్చుకునేందుకు యువత ప్రయత్నిస్తోంది.
నగరంలో ఇటీవల కాలంలో ‘హోమ్ ఫుడ్ అండ్ వీగన్ వీక్స్’ అనే కాన్సెప్ట్ పాపులర్ అవుతోంది. వారంలో కొన్ని రోజులు పూర్తిగా ఇంట్లో తయారుచేసిన ఆహారం లేదా ప్లాంట్-బేస్డ్ డైట్ తీసుకోవాలనే అలవాటు కొంతమంది యువతలో ప్రారంభమైంది. జిమ్‌లు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, అలాగే సోషల్ మీడియా ద్వారా ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
అయితే, హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బిర్యానీ కల్చర్ మాత్రం తగ్గలేదని రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లకు ఇప్పటికీ భారీ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. కానీ అదే సమయంలో ఫుడ్ ఎంపికలో అవగాహన పెరుగుతూ, సమతుల్య ఆహార అలవాట్లు నెమ్మదిగా స్థిరపడుతున్నాయి.
డైట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉద్యోగ ఒత్తిడి, లైఫ్‌స్టైల్ మార్పులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన పెరగడం వల్ల ప్రజలు ఆహారంపై కొత్తగా ఆలోచిస్తున్నారు. “ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట ఫుడ్ కాదు.. శరీరానికి సరిపడే ఆహారం కావాలి” అనే భావన యువతలో పెరుగుతోందని వారు చెబుతున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా ఈ మార్పును గుర్తించి హెల్తీ మీల్స్, హోమ్ స్టైల్ ఫుడ్, వీగన్ ఆప్షన్స్‌ను పెంచుతున్నాయి. చిన్న హోమ్ కిచెన్లు, క్లౌడ్ కిచెన్లు కూడా ఈ ట్రెండ్‌ను ముందుగా గుర్తించి అందిపుచ్చుకుంటున్నాయి.
రోజంతా కార్యాలయాల్లో కూర్చొని పని చేయడం, పని ఒత్తిడి కారణంగా నేటి యువతలో ఊబకాయం రోజురోజుకూ పెరుగుతోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో ప్రతి పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురు ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన, సమతుల్య ఆహార విధానాలు పాటించకపోవడమే. దీంతో యువత అర్ధరాత్రులు బిర్యానీలు తినడం కంటే సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలన్న భావనకు వస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాలయాల్లోనూ డైట్ ప్లాన్ పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే, హైదరాబాద్ ఫుడ్ కల్చర్ పూర్తిగా మారిపోలేదు. కానీ బిర్యానీ కల్చర్‌తో పాటు హెల్త్ ఫుడ్ ట్రెండ్ కూడా సమాంతరంగా ఎదుగుతోందని చెప్పొచ్చు.
