అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి ..
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి ..
బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకం : ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సమీక్ష
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
స్థానిక కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్రియలో కచ్చితత్వం, సంపూర్ణత పెంపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని, వారు ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపుల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ ప్రకారం జూన్ 5 నుంచి 14 వరకు శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతారని, జూలై 14న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు.
బూత్ లెవెల్ అధికారులు బాధ్యతాయుతంగా ఇంటింటి పరిశీలన నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేయాలని ఆమె సూచించారు. ఓటర్లకు దరఖాస్తులు నింపడంలో సహాయం చేయడం, సందేహాలు నివృత్తి చేయడం బీఎల్ఓల బాధ్యత అని పేర్కొన్నారు. అనుమానాస్పద, డూప్లికేట్, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని ఆదేశించారు.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 14,74,981 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, ఎన్నికల సెక్షన్ ఇన్చార్జి సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
