Nerella Victim Death | న్యాయ పోరాటం చేస్తాం..

నేరెళ్ల బాధితుడి మృతిపై కవిత స్పందన

Nerella Victim Death | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నేరెళ్ల ఘటన బాధితుడు గంధం గోపాల్ మృతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2017లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఘటన అనంతరం పోలీసుల చిత్రహింసలకు గురైన గోపాల్, గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం అత్యంత బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గంధం గోపాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కవిత, ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి న్యాయం జరిగేలా తమ పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని అమలు చేయలేదని కవిత ఆరోపించారు. ఇదే విధంగా, బాధితులకు అండగా ఉంటామని చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. నేరెళ్ల బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేశారు.