జహీరాబాద్‌కు త్రివేణివనం

  • 208 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ఎకో పార్కు ప్రజలకు అంకితం
  • వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • పచ్చదనం పెంపే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ సురేష్ షెట్కార్

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: జహీరాబాద్ పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో 208 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన త్రివేణివనం–ఫారెస్ట్ ఎకో పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వనమహోత్సవం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా హరిత వాతావరణాన్ని నెలకొల్పే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 11 ఎకో పార్కులను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించడం హర్షణీయమన్నారు.

జహీరాబాద్ ప్రాంతం నిమ్జ్ ద్వారా పారిశ్రామిక స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటోందని, భారీ పరిశ్రమల రాకతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన త్రివేణివనం ఎకో పార్కులో హైదరాబాద్ కేబీఆర్ పార్కు తరహా సౌకర్యాలను కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.

టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రాణవాయువును అందించే చెట్లు, అడవులను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ త్రివేణివనం–ఫారెస్ట్ ఎకో పార్కును ఆకర్షణీయంగా అభివృద్ధి చేశామని తెలిపారు. పార్కులో సైక్లింగ్‌తో పాటు పలు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వనమహోత్సవం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని మరింత విస్తరించాలని కోరారు.

అనంతరం అతిథులు అటవీ శాఖ రూపొందించిన వనమహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సఫారీ వాహనంలో ఎకో పార్కును సందర్శించి వివిధ సౌకర్యాలను పరిశీలించడంతో పాటు మొక్కలు నాటారు. అనంతరం జెండా ఊపి సైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా అటవీ అధికారి ప్రసాద్ రెడ్డి, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ చైర్మన్ యూనిస్, ఉజ్వల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తహసీల్దార్, అటవీ శాఖ, పోలీసు శాఖ అధికారులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.