భీమ్‌గల్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్‌లో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు కావడం ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచిందని డాక్టర్ మధుశేఖర్ అన్నారు. కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన గత, ప్రస్తుత వీడీసీ సభ్యులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని మీడియా ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. జూనియర్ సివిల్ కోర్టు అందుబాటులోకి రావడంతో చిన్న సివిల్ వివాదాలు, ప్రమాదాలకు సంబంధించిన కేసుల కోసం ప్రజలు ఇకపై ఆర్మూర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదని, దీంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఈ ప్రాంత విద్యార్థులు న్యాయవాదులు, న్యాయమూర్తులుగా ఎదగడానికి ఈ కోర్టు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భీమ్‌గల్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజలు, యువత, నాయకులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలని కోరారు.