Vijayawada |దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన ఎంపీ చిన్ని

  • కనకదుర్గమ్మ ఆలయాన్ని మరింత తీర్చిదిద్దాలి
  • లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
  • ‘ప్రసాద్’ పథకం కింద ప్రత్యేక నిధులు ఇవ్వండి
  • ‘పర్వతమాల’ పథకంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • భక్తుల సౌకర్యాలు మరింత విస్తరించాలి
  • విజయవాడ పర్యాటక, ఆర్థికాభివృద్ధికి ఊతమని అభిప్రాయం

విజయవాడ,ఆంధ్రప్రభ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో నియమం–377 కింద ప్రత్యేక అంశాన్ని ప్రస్తావిస్తూ ఆలయ సమగ్ర అభివృద్ధికి అవసరమైన శాశ్వత మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణానది తీరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ శక్తిపీఠమని, తిరుపతి తర్వాత అత్యధిక మంది భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఇది ఒకటని ఎంపీ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రులు, భవానీ దీక్షలు, తెప్పోత్సవం తదితర ఉత్సవాల సందర్భంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 50 వేల మంది, పండుగల సమయంలో రెండు లక్షలకు పైగా భక్తులు ఆలయానికి వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్

పథకం కింద ప్రత్యేక నిధులు కేటాయించి బహుళ అంతస్తుల కార్ పార్కింగ్, విశాలమైన వేచివుండే మందిరాలు, ఆధునిక యాత్రికుల సౌకర్య కేంద్రాలు, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు, డిజిటల్ సమాచార కేంద్రాలు వంటి సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే కేంద్ర ‘పర్వతమాల’ పథకం కింద ఇంద్రకీలాద్రికి ఆధునిక రోప్‌వే వ్యవస్థను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు సులభంగా ఆలయ దర్శనం లభించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు. వారణాసి, అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి నమూనాను కనకదుర్గ అమ్మవారి ఆలయానికి కూడా వర్తింపజేయాలని ఎంపీ కోరారు.

ఆలయ అభివృద్ధి ద్వారా విజయవాడలో ఆధ్యాత్మిక పర్యాటకం మరింత విస్తరించి, హోటల్, రవాణా, సేవారంగాలు, చిన్న వ్యాపారాలు, స్థానిక కళాకారులు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల ఆకాంక్ష మేరకు కనకదుర్గ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధి అంశాన్ని లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆలయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ‘ప్రసాద్’ పథకం కింద ప్రత్యేక నిధులు, ‘పర్వతమాల’ పథకం కింద రోప్‌వేకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదం తెలపాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు.