ACB Trap | నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ లంచం తీసుకుంటూ…
ACB Trap | నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ లంచం తీసుకుంటూ…
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య, ఎంపీడీవో కుమారుడు పెనుగొండ నాగార్జునలను శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం గ్రామ పరిధిలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. అనంతరం సంబంధిత అనుమతులు మంజూరయ్యాయి. అయితే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆ భూమిపై తనకే హక్కు ఉందంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో మండల అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి.
ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని, కోర్టు నోటీసుల వ్యవహారాన్ని తామే చూసుకుంటామని చెప్పిన అధికారులు బాధితుల నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో గత నెలలో ఎంపీడీవోకు రూ.30 వేలు, ఎంపీఓకు రూ.25 వేలు చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధితులు తెలిపారు.
దీంతో బాధితులు ఏసీబీ వరంగల్ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఎంపీడీవో రాధిక, ఎంపీఓ యాకయ్యలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు.
