సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం
పాల్గొన్న రాష్ట్ర మంత్రులు
వేములవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా విలసిల్లాలని ఆకాంక్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం వరుణ యాగం ప్రారంభమైంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ యాగంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వరుణ యాగంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక క్రతువులు, పూజలు నిర్వహించనున్నారు.

