AP | నందిగామ మున్సిపాలిటీ కూటమి కైవసం

  • చైర్ పర్సన్ గా టిడిపి అభ్యర్థి…
  • మండవ కృష్ణ కుమారుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లు..
  • అమరావతి ఉద్యమంలో కేసులు…
  • 14 రోజులు జైలు జీవితం గడిపిన కృష్ణకుమారి

(ఆంధ్రప్రభ కంచికచర్ల) : గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠత నెలకొన్న నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ కు జరిగిన ఎన్నికల్లో కూటమి బలపరిచిన మున్సిపల్ పదో వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. మంగళవారం నందిగామ పాత బస్టాండ్ లోని బాబు జ‌గ్జీవ‌న్ రాం భవన్ లో ఎన్నికల అధికారి, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ నందిగామ మున్సిపల్ ఎన్నికను నిర్వహించారు. మండవ కృష్ణకుమారి పేరుతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన బీఫాంను ఎన్నికల అధికారికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సమర్పించారు. ఎన్నికల అధికారి నిర్దేశించిన సమయానికి 11గంటలకల్లా మున్సిపల్ సభ్యులు 18మంది హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా హాజరయ్యారు. నందిగామ పురపాలక సంఘంలో మొత్తం 20మంది సభ్యులు ఉండగా, ఇరువురు మృతి చెందడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో సహా మొత్తం 19మంది చైర్మన్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్టీవో బాలకృష్ణ చేతులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కూటమి బలపరిచిన అభ్యర్థిని మండవ కృష్ణకుమారికి మద్దతుగా 14మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా మద్దతు పలకగా మొత్తం 15మంది మద్దతు పలకడంతో నందిగామ మున్సిపల్ చైర్మన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో కే బాలకృష్ణ ప్రకటించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ముగ్గురు సభ్యులు మద్దతు పలికారు. ఒక సభ్యురాలు తటస్థంగా ఉన్నారు. దీంతో మండవ కృష్ణకుమార్ ను అధికారికంగా చైర్మన్ గా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్ గా ఎవరు ఎన్నికవుతారా అని తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం తొలుత సోమవారం ఎన్నికల అధికారి ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఎన్నిక ప్రారంభ సమయానికి 11గంటల వరకు వైసీపీకి చెందిన నలుగురు సభ్యుల మినహా కూటమి సభ్యులు ఎవరూ హాజరు కాకపోవటంతో ఎన్నికల అధికారి బాలకృష్ణ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మంగళవారం నిర్ణీత సమయానికి సజావుగా జరిగింది. చైర్మన్, అభ్యర్థిగా ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో కూటమి సోమవారం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కూటమిలో సందిగ్ధత నెలకొంది. చైర్మన్ అభ్యర్థి విషయంలో స్థానిక శాసనసభ్యురాలు సౌమ్య ఒకరికి మద్దతు పలకగా, ఎంపీ కేశినేని శివనాథ్ వేరొకరికి మద్దతు పలకటం వల్ల కూటమి చైర్మన్ విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లు బలంగా వార్తలు వచ్చాయి.

ఈనేపథ్యంలో మంత్రి నారాయణ విషయాన్ని చక్కదిద్ది సందిగ్ధతకు తరలించినట్లు తెలుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే బలపరిచిన ఇరువురు అభ్యర్థులు కాకుండా తటస్థంగా మధ్యేమార్గంగా వేరొక అభ్యర్థిని నిలబెట్టాలని మంత్రి నారాయణ సూచించడంతో అనూహ్యంగా తెరపైకి మండవ కృష్ణకుమారి పేరు కూటమి అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. అధిష్టానం కృష్ణ కుమారికి బీఫామ్ ఇవ్వటంతో చైర్మన్ ఎంపిక విషయంపై సందిగ్ధత తొలగి ఎన్నిక సజావుగా జరిగింది. దీంతో శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నిర్ణయానికి అన్ని విధాలా కూటమి మున్సిపల్ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.

నందిగామ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మండవ కృష్ణకుమారి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ… తన ఎన్నికకు సహకరించిన ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ధన్యవాదాలు తెలిపారు. తనను బలపరిచిన కౌన్సిలర్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్స్ అందరినీ కలుపుకొని నందిగామ పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆశావహులు ఎక్కువ ఉండటంతో చైర్మన్ అభ్యర్థి విషయంలో జాప్యం జరిగిందని, అధిష్టానంతో సంప్రదించి అధిష్టానం సూచించిన అభ్యర్థికి కూటమి సభ్యులందరూ బలపరచి, 15మంది సభ్యుల మద్దతుతో చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఘన విజయంగా ఆమె పేర్కొన్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భావించి విజయం సాధించటం జరిగిందని, గత ఐదు సంవత్సరాల కాలంలో వెనుకబడిన నందిగామ పురపాలక సంఘ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన చైర్మన్ పూర్తిగా కృషి చేస్తారని, మున్సిపల్ సభ్యులతో సహా ప్రతి ఒక్కరూ పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *