ఎక్సైజ్ కార్యాలయం ముందే మురుగు
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ జిల్లా కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త భవనం ఆకర్షణీయంగా నిర్మించినప్పటికీ, కార్యాలయంలోకి వెళ్లే ప్రధాన గేటు ముందే మురుగు నీరు నిలిచి కాలువను తలపించే పరిస్థితి నెలకొంది. ప్రజలు, సిబ్బంది నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలోనే ఈ దుస్థితి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట భారీగా నిలిచిపోయిన మురుగు నీరు, గుంతల కారణంగా లోపలికి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన, నిబంధనల అమలును పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖ కార్యాలయం ముందే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.
మురుగు నీటి నిల్వతో దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురుగు నీటిని తొలగించి, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
