మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, ఆంధ్రప్రభ : మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో మైనార్టీ సోదరుల సంక్షేమానికి నిర్వహించే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఓల్డ్ బైపాస్ రోడ్డులోని ఉర్దూ ఘర్ అంజుమన్ కమిటీ నూతన చైర్మన్ సయ్యద్ జబీన్, కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే రాము అందరినీ కలుపుకొని పోతూ మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో వర్గాలు, రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని, మైనార్టీ సోదరులకు మేలు జరిగే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రాము వారికి చెప్పారు.
ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ చైర్మన్ సయ్యద్ జబీన్, మైనార్టీ పెద్దలు తమ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే రాముకు గౌరవ సత్కారం చేశారు. అల్లా దైవం ఆశీస్సులు, ఎమ్మెల్యే రాము సహకారంతో అంజుమన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని చైర్మన్ సయ్యద్ జబీన్ పేర్కొన్నారు. అంజుమన్ కమిటీ చరిత్రలోనే అతి చిన్న వయసులో తనను చైర్మన్‌గా నియమించినందుకు గర్వంగా ఉందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే రాము ఆకాంక్షలకు అనుగుణంగా మైనార్టీ సంఘీయుల అభివృద్ధికి తమ కమిటీ శక్తివంచన లేకుండా పనిచేస్తుందని సయ్యద్ జబీన్ స్పష్టం చేశారు.
త్వరలో అంజుమన్ భవన ప్రాంగణంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని మైనార్టీ పెద్దలు తెలిపారు. ముందుగా ప్రజలందరి హితం కోరుతూ మత గురువులు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాముని కలిసిన వారిలో ఉర్దూ ఘర్ అంజుమన్ సభ్యులు మీరా షరీఫ్, అబ్దుల్ లతీఫ్, అలీ, కుదూస్, నూరుద్దీన్, ఇర్ఫాన్, మహబూబ్ సుభాని, షేక్ రఫీ, అబ్దుల్ గని, మైనార్టీ పెద్దలు సయ్యద్ గఫ్ఫార్, సయ్యద్ మోబిన్, బజని, యాసిన్, అస్మా , సుబ్బారావు, మత పెద్దలు హఫీజ్ మొహమ్మద్ సత్తార్ సయ్యద్ చాన రజా, షానవాజ్ రజ్వీ, తదితర నేతలు ఉన్నారు.
