భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
మంత్రి వివేక్ వెంకటస్వామి
గాయపడిన బాధితులను పరామర్శించిన మంత్రి..
హెల్ప్‌డెస్క్‌ను వినియోగించుకోవాలని సూచన
చెన్నూర్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. నిరంతర వర్షాల కారణంగా చెన్నూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, గోదావరి నది కూడా ఉగ్రరూపం దాల్చిందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సంబంధిత అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.

కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
భారీ వర్షాల దృష్ట్యా చెన్నూర్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి అవసరమైన సహాయం పొందాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
