సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలో చేపట్టనున్న రెండు రోజుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
పర్యటన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వేదికలు, సమావేశ ప్రాంగణాలు, పరిశీలన ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారుల మరమ్మతులు, పార్కింగ్, వైద్య సేవలు వంటి అంశాల్లో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో రహదారుల పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ హెలీప్యాడ్లు, కార్యక్రమ ప్రాంగణాలు, వీవీఐపీ మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, చెత్త తొలగింపు వంటి అంశాలపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు బస చేయనున్న సోమశిల హరిత గెస్ట్ హౌస్‌లో భద్రత, వసతి, ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
పర్యటన నిర్వహణలో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, రోడ్లు-భవనాలు, నీటిపారుదల, పోలీసు శాఖల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు. శాఖల మధ్య సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు ప్రతి అధికారి అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడా నిర్లక్ష్యం లేదా లోపాలకు తావివ్వకుండా సమన్వయం, క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
